Advertisement

వైరల్ వీడియో కేసులో తీర్పు: బాలుడికి వినూత్న శిక్ష విధించిన జువైనల్ బోర్డు

Juvenile Justice Board unique verdict in Chaderghat viral video case
  • గతేడాది వైరల్ అయిన చాదర్‌ఘాట్ ఆటో వేధింపుల కేసులో తీర్పు
  • నిందితుడైన మైనర్‌కు నెల రోజుల సామాజిక సేవ శిక్ష విధింపు
  • రోజూ ఉదయం 10 నుంచి 2 వరకు జువైనల్ బోర్డులో రిపోర్ట్ చేయాలని ఆదేశం 
  • బాలుడిలో సంస్కరణే లక్ష్యంగా జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు
గతేడాది తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాదర్‌ఘాట్ ఆటో వేధింపుల కేసులో నాంపల్లి జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు నెల రోజుల పాటు సామాజిక సేవ (కమ్యూనిటీ సర్వీస్) చేయాలని ఆదేశించింది. నిందితుడిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడం, అతడిని సంస్కరించడమే లక్ష్యంగా ఈ తీర్పునిచ్చినట్లు బోర్డు పేర్కొంది.

బోర్డు ఆదేశాల ప్రకారం.. సదరు బాలుడు నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జువైనల్ జస్టిస్ బోర్డు కార్యాలయంలో హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

2023 నవంబర్ 7వ తేదీ రాత్రి, హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వంతెనపై కదులుతున్న ఆటోలో (TG05T4061) ఒక మహిళను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో చాదర్‌ఘాట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పెట్రోలింగ్ బృందం సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు మైనర్ అని తేలడంతో కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు బదిలీ చేశారు.

ఈ కేసు ఫైలును తదుపరి చట్టపరమైన చర్యల కోసం 5వ వీఏసీజేఎం (VACJM) కోర్టుకు పంపినట్లు చాదర్‌ఘాట్ ఇన్స్‌పెక్టర్ తెలిపారు.                        
Advertisement
Juvenile Justice Board
Chaderghat auto harassment case
Hyderabad police
Community service punishment
Viral video case verdict
Nampally court

More Telugu News