గతంలో మమ్మల్ని అడ్డుకున్నారు.. ఇప్పుడు జగన్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం: లోకేశ్

Nara Lokesh says TDP government provides freedom to Jagan unlike past YSRCP rule
  • ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ సమావేశం
  • జగన్ రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని వ్యాఖ్యలు
  • బ్రాహ్మణి స్టీల్స్, ఓబులాపురం దోపిడీతోనే సాక్షి మీడియా ఏర్పాటు అని ఆరోపణ
  • వాళ్లు ఫ్యాక్షన్ తెస్తే.. మేం ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలిస్తున్నాం అని వెల్లడి
  • ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఉద్ఘాటన
"గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఇంటి నుంచి బయటకు రానీయకుండా గేట్లకు తాళాలు వేయించారు. కానీ ఈరోజు మేం జగన్ స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతిస్తున్నాం. ఇదే మాకూ, వారికీ ఉన్న తేడా" అని మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అన్నారు. బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

"జగన్ రాయలసీమ బిడ్డ కాదు, ఈ సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ" అని లోకేశ్ ఘాటుగా విమర్శించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 14,000 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసి, 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఆరోపించారు. ఓబులాపురం గనుల నుంచి దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పత్రిక, టీవీలను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాలనలో కడప జిల్లాకు జగన్ చేసిందేమీ లేదని, ఆయన నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లిచ్చింది కూడా చంద్రబాబేనని గుర్తుచేశారు.

"గొడ్డలి పార్టీ ఫ్యాక్షనిజం తెస్తే, మేం ఫ్యాక్టరీలు తెస్తున్నాం. రాయలసీమలో వారు రక్తాన్ని పారిస్తే, మేం ఉద్యోగాల పంట పండిస్తున్నాం" అని లోకేశ్ అన్నారు. తమ ప్రభుత్వం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేసిందని, ఎస్ఏఈఎల్ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిందని తెలిపారు. 

ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం

వైసీపీ హయాంలో దారుణహత్యకు గురైన బీసీ నేత నందం సుబ్బయ్య కుటుంబాన్ని ఆదుకుని, పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌లో చదివిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేనని లోకేశ్ అన్నారు. ఎంతచేసినా వారి రుణం తీర్చుకోలేమని భావోద్వేగంతో చెప్పారు. 

"ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నాపై కోడిగుడ్లతో దాడిచేసి, భయపెట్టాలని చూశారు, జి.ఓ. నెం.1 పేరుతో పాదయాత్రను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కడప జిల్లా. మధ్యలో రెండు ఎన్నికల్లో ఇబ్బందిపడినా గత ఎన్నికల్లో పోరాడిన కార్యకర్తలు పార్టీకి గత వైభవం తెచ్చారు. అధికారంలోకి వచ్చామని కష్టకాలాన్ని మర్చిపోకూడదు. నేను పాదయాత్ర బుక్ చూసినపుడు ఆనాటి స్మృతులన్నీ గుర్తుకువస్తుంటాయి" అని వివరించారు.

ఈ నెల 24న రెండో విడత 'తల్లికి వందనం' నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించారు. రూ.4000 పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను అమలు చేస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌సిపి హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించామని, చెత్తపన్నును రద్దు చేశామని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, నాయకులందరూ వర్గాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Nara Lokesh
Jagan Mohan Reddy
Proddutur TDP Meeting
Rayalaseema Development
Thalliki Vandanam Scheme
Andhra Pradesh Politics

More Telugu News