షాబాద్ ఆరు మర్డర్ల కేసు నిందితుడు రాజ్‌కుమార్ చివరకు శవమై తేలాడు!
- కొత్తూరు మండలం పెంజర్లలో మృతదేహం లభ్యం
- మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్
- ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ
- స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
- మృతదేహం సమీపంలో విషం బాటిల్ లభ్యం
రంగారెడ్డి జిల్లాలో తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చి, రెండు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు బి. రాజ్ కుమార్ (29) సోమవారం శవమై కనిపించాడు. హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం, పెంజర్ల వద్ద ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ గ్రామం అతని మేనమామ స్వగ్రామంగా తెలుస్తోంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఇతర ఉన్నతాధికారులు మృతుడిని రాజ్ కుమార్‌గా నిర్ధారించారు. మృతదేహం సమీపంలో విషం సీసా లభించడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు.
జూలై 10వ తేదీ రాత్రి షాబాద్ మండలంలో రాజ్ కుమార్ ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. తనపై పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, నాయనమ్మతో పాటు తన భార్య సరిత, ఇద్దరు కుమారులను కత్తితో పొడిచి, గొంతు కోసి చంపాడు. ఈ హత్యలు చేసిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి, విషయం చెప్పి తాను కూడా చనిపోతున్నట్లు తెలిపాడు.
పోక్సో కేసు పెట్టిన కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో గత నెలలోనే అతనికి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. హత్యల తర్వాత రాజ్ కుమార్ కోసం పోలీసులు భారీ గాలింపు చేపట్టి, అతని ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
కాగా, నిందితుడి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారని బాధితుల కుటుంబం ఆరోపించడంతో పోక్సో కేసు దర్యాప్తు అధికారి అయిన షాబాద్ ఎస్సై టి. రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు..