చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు: తెలంగాణ జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్
- హైదరాబాద్‌లోని నివాసంలో కేవీఆర్ అరెస్టు
- బొబ్బిలి కోర్టులో హాజరుపరిచిన ఏపీ పోలీసులు
- విజయనగరం జిల్లాలో ఏప్రిల్ 10న నమోదైన ఫిర్యాదు ఆధారంగా చర్యలు
విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్ కంది రమేశ్ ఏప్రిల్ 10న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో పాటు రాజ్యాంగంపై కూడా కేవీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ కేవీఆర్ విచారణకు హాజరుకాకపోవడంతో, ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీని ఆధారంగా జూన్ 30న రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అయితే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి తన భర్తను అరెస్టు చేశారని కేవీఆర్ భార్య ఆరోపించారు. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదే సమయంలో, ఏలూరులో జరిగిన ఒక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన మరో యూట్యూబర్ బి. జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్'ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తాము విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం తన కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.