హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
- ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
- అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం
- కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ
- అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు
- రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా
మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే దారిలో ఉన్న సర్వే నంబర్ 42లోని ఈ విలువైన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. చుట్టూ రేకులతో ఫెన్సింగ్ వేస్తుండగా రెవెన్యూ శాఖ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, అక్రమ నిర్మాణాలను తొలగించి, ఇది ప్రభుత్వ భూమి అని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేసింది.
మరోవైపు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మర్రిపల్లి గ్రామంలోని చెరువు కబ్జాను కూడా హైడ్రా అడ్డుకుంది. పట్టా భూమిలో ఆర్‌ఎంసీ యూనిట్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి, వ్యర్థాలను చెరువులోకి డంప్ చేస్తూ సుమారు ఐదెకరాల చెరువు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు దర్యాప్తు చేసి, చెరువు శిఖం (ఎఫ్‌టీఎల్) పరిధిలో కార్మికుల కోసం నిర్మించిన షెడ్లను తొలగించారు. చెరువులోకి వేసిన మట్టిని వెంటనే తొలగించాలని కబ్జాదారుడిని హైడ్రా ఆదేశించింది.
కాగా, గత రెండేళ్లలో హైడ్రా ఏజెన్సీ రూ.1.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ చెరువులు, నాలాలు, పార్కులు, భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఈ నెల ప్రారంభంలో వెల్లడించింది. వచ్చే ఏడాది నాటికి రూ.2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.