సైబర్ మోసాల్లో కొత్త కోణం.. ఉన్నత విద్యావంతులే టార్గెట్!
Advertisement

సైబర్ మోసాల్లో కొత్త కోణం.. ఉన్నత విద్యావంతులే టార్గెట్!

New dimension in cyber fraud highly educated people are targets
  • సైబర్ మోసాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు
  • బాధితుల్లో ఐటీ నిపుణులు, డాక్టర్లు, బ్యాంకు ఉద్యోగులు
  • ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో వెల్లడైన కీలక వాస్తవాలు
  • మానసిక ఒత్తిడిలో ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటున్న కేటుగాళ్లు
  • డిజిటల్ అక్షరాస్యత మోసాల నుంచి రక్షించలేదన్న నివేదిక
సైబర్ ఆర్థిక మోసాల బారిన కేవలం నిరక్షరాస్యులు, అవగాహన లేని వారు మాత్రమే పడతారనే అపోహను ఐఐటీ మద్రాస్ తాజా అధ్యయనం పటాపంచలు చేసింది. ఉన్నత విద్యావంతులు, డిజిటల్ పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ఈ మోసాలకు గురవుతున్నారని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కేవలం డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండటం ఒక్కటే సైబర్ నేరాల నుంచి పూర్తి రక్షణ కల్పించలేదని ఈ నివేదిక తేల్చి చెప్పింది.

ఐఐటీ మద్రాస్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, ప్రొఫెసర్ పి. కందస్వామి, ప్రొఫెసర్ నందన్ సుదర్శనం నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. ఇందుకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోని బాధితులపై సర్వే నిర్వహించారు. బాధితుల్లో ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు, వైద్యులు, ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ ధ్రువీకరణ పత్రాలు కలిగిన వారు సైతం ఉండటం గమనార్హం.

సైబర్ నేరగాళ్లు బాధితులను ఎంచుకోవడంలో ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వేట, పదవీ విరమణ, పని ఒత్తిడి వంటి కారణాలతో మానసిక ఆందోళనకు గురవుతున్న వారిని వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. భయం, ఆత్మన్యూనత వంటి భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని, వారిని మానసికంగా లొంగదీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ మోసాల కారణంగా బాధితులు కేవలం ఆర్థికంగానే కాక, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అవమాన భారంతో కుంగిపోవడం, నిద్రలేమి, డిప్రెషన్, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కోల్పోవడం వంటి పరిణామాలు వారిని వేధిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు, సైబర్ క్రైమ్ విభాగాలు సత్వరమే స్పందిస్తున్నప్పటికీ, మరికొన్ని విభాగాలు సాంకేతిక సామర్థ్యం లోపం కారణంగా వెనుకబడుతున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ నేపథ్యంలో, నివారణ వ్యూహాలను రూపొందించేటప్పుడు ఈ క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Advertisement
IIT Madras
Cyber Fraud
Digital Literacy
Educated Victims
Cyber Crime Study
Online Scams

More Telugu News