బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం!

Venkanna Bhupalpally DTO dies in coal tipper accident
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను వేగంగా ఢీకొన్న టిప్పర్
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న
  • డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం  

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఉదయం ఒక అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ విధుల్లో భాగంగా రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. వెంకన్న (45) ను ఒక బొగ్గు టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన జిల్లా అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


వివరాల్లోకి వెళితే... గణపురం మండలం చెల్పూర్ శివారులోని ప్రాంతీయ రవాణా శాఖ (RTO) కార్యాలయం ఎదుట, ఆర్డీవో ఆఫీస్ సమీపంలో డీటీఓ వెంకన్న తన సిబ్బందితో కలిసి ఉదయం రెగ్యులర్ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుండి బొగ్గు లోడ్‌తో పరకాల వైపు అతివేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ అదుపుతప్పి.. వెనుక నుంచి నేరుగా వెంకన్నపైకి దూసుకెళ్లింది.


లారీ వేగానికి డీటీఓ వెంకన్న శరీరం పూర్తిగా నుజ్జునుజ్జయి రోడ్డుపై పడిపోయింది. కళ్లెదుటే జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని చూసి తోటి రవాణా శాఖ సిబ్బంది, స్థానికులు తీవ్ర షాక్‌కు లోనయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


మహబూబాబాద్ జిల్లా మారిపెడ మండలానికి చెందిన వెంకన్న.. గతంలో జగిత్యాల జిల్లాలో పనిచేశారు. అక్కడి నుండి కేవలం 15 నుండి 20 రోజుల క్రితమే ఆయన భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చి డీటీఓగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా విధుల్లో చేరిన కొన్ని రోజుల్లోనే ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆ కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
Go Back to Shorts
Venkanna
Bhupalpally DTO
Road Accident
Coal Tipper
Jayashankar Bhupalpally
Telangana Transport Department

More Telugu News