కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి
- మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51)
- కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన
- కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
సంధ్యా అచ్చయ్య తన ఎస్టేట్ మేనేజర్, డ్రైవర్‌తో కలిసి కాఫీ తోటను పరిశీలిస్తుండగా, ఒక అడవి ఏనుగు అకస్మాత్తుగా వారిపై దాడికి తెగబడింది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఫోన్ ద్వారా సునీల్ అచ్చయ్యను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొడగు ప్రాంతంలో పెరుగుతున్న ఏనుగు-మానవ సంఘర్షణలను నివారించడానికి తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద ఘటనతో కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన కొడగులో వన్యప్రాణుల సంచారం, స్థానికుల భద్రత అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.