భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్... ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌ కైవసం

FIFA World Cup Broadcasting Rights Acquired by Zee Network
  • యునైట్8 స్పోర్ట్స్ చేతికి ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు
  • టీవీలో యునైట్8, ఓటీటీలో జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు
  • 2034 వరకు ఫిఫా మేజర్ టోర్నీలన్నీ జీ నెట్‌వర్క్‌లోనే
  • ధర విషయంలో విభేదాలతో వెనక్కి తగ్గిన జియోస్టార్
  • క్రీడా ప్రసారాల్లోకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ రీ-ఎంట్రీ
భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ శుభవార్త చెప్పింది. ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రసార హక్కులను జీకి చెందిన ‘యునైట్8 స్పోర్ట్స్’ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, 2026 ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు 2030 వరల్డ్ కప్ కూడా జీ నెట్‌వర్క్‌లోనే ప్రసారం కానున్నాయి. టీవీలో యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లలో, డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

ఈ ఒప్పందం కేవలం పురుషుల వరల్డ్ కప్‌కు మాత్రమే పరిమితం కాదు. 2027 ఫిఫా మహిళల వరల్డ్ కప్‌తో పాటు అండర్-17, అండర్-20, ఫుట్‌సాల్ వరల్డ్ కప్ వంటి ఇతర ప్రధాన ఫిఫా ఈవెంట్‌ల ప్రసార హక్కులను కూడా 2034 వరకు జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. హిందీలో యునైట్8 స్పోర్ట్స్ 1, 1 HD ఛానళ్లలో, ఇంగ్లీష్‌లో యునైట్8 స్పోర్ట్స్ 2, 2 HD ఛానళ్లలో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

వాస్తవానికి ఈ హక్కుల కోసం జియోస్టార్ కూడా పోటీ పడింది. అయితే ధర విషయంలో ఫిఫాతో ఒప్పందం కుదరకపోవడంతో ఆ సంస్థ వెనక్కి తగ్గింది. 2026 వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుండటంతో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం చాలా ఆలస్యంగా ప్రారంభమవుతాయి. అయినప్పటికీ, జీ ఈ హక్కులను దక్కించుకోవడం విశేషం.

ఈ ఒప్పందంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ పునిత్ గోయెంకా హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంబరాల్లో ఒకటైన ఫిఫా వరల్డ్ కప్‌ను భారత ప్రేక్షకులకు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఫిఫాతో మా భాగస్వామ్యం ద్వారా ఈ క్రీడ నిజమైన విలువను వెలికితీయగలమని నమ్ముతున్నాము" అని ఆయన తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత జీ నెట్‌వర్క్ తిరిగి క్రీడా ప్రసారాల్లోకి గ్రాండ్‌గా అడుగుపెడుతుండటం గమనార్హం. 2026 ఫిఫా వరల్డ్ కప్ జూన్ 11న ప్రారంభం కానుంది.
Go Back to Shorts
FIFA World Cup
Zee Network
FIFA
Football
United8 Sports
JioStar
Punit Goenka
FIFA Womens World Cup
FIFA Under 17 World Cup
FIFA Under 20 World Cup

More Telugu News