బండి బగీరథ్ కేసు.. మరో సిట్ ఏర్పాటు

Bandi Sanjay Son Case Another SIT Investigation Ordered
  • బండి బగీరథ్ బెయిల్ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి
  • ఆమెను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
  • తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు

తెలంగాణలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, బండి భగీరథ్‌ పోక్సో కేసు వ్యవహారంలో మరో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్‌ మీడియా వేదికగా జరిగిన అనుచిత, అవమానకర ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. జాయింట్‌ సీపీ శ్వేత ఆధ్వర్యంలో ఈ సిట్‌ పనిచేస్తుందని, న్యాయవ్యవస్థపై జరిగిన ఈ దుష్ప్రచార మూలాలను పూర్తిగా వెలికితీస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


బండి భగీరథ్‌కు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవి వద్దకు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని ఐటీ సెల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ వేదికగా ఆమెను లక్ష్యంగా చేసుకుని కొన్ని అనుచిత పోస్టులను సర్క్యులేట్ చేశారు. బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దానికి ప్రతిఫలంగా జస్టిస్ మాధవి దేవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్ట్ ఇస్తారంటూ తీవ్ర ఆరోపణలతో కూడిన పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వ్యవహారం న్యాయవ్యవస్థ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.


ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవి దేవి తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం విచారణ జరిపే న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇలాంటి పోస్టులు పెట్టడంపై దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దీనిపై తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు.


న్యాయమూర్తుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సోషల్ మీడియా దాడికి సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడైన దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. జాయింట్‌ సీపీ శ్వేత నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పుడు ఈ పోస్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏ ఐటీ సెల్స్ దీనిని వ్యాప్తి చేశాయనే కోణంలో లోతైన దర్యాప్తు ప్రారంభించింది.

Go Back to Shorts
Bandi Sanjay
Bandi Bhagirath
Telangana High Court
Justice Madhavi Devi
Social Media Campaign
POCSO Case
SIT Investigation
Defamation
Cyber Crime
IT Cells

More Telugu News