ఏపీలో విచిత్ర వాతావరణం: ఓవైపు వానలు.. మరోవైపు వడగాల్పులు

Andhra Pradesh Weather Rains and Heatwaves Create Havoc
  • ఏపీలో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు
  • రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
  • కొన్ని మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక
  • అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు
  • చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో నిలిచిన కరెంట్ సరఫరా
ఏపీలో వాతావరణం విభిన్న రీతుల్లో కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తుండగా, మరోవైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ భిన్నమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రోపో ఆవరణంలోని గాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

రైతులకు నష్టం.. ప్రజలకు ఊరట
గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, వారం రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు.

కొనసాగుతున్న వడగాల్పులు
వర్షాలు కురవని ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం పోలవరం జిల్లా వీఆర్ పురంలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్లూరి జిల్లా గంపరైలో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
AP Weather
Andhra Pradesh Weather
Rainfall AP
Heatwave AP
Cyclone Alert
Weather Forecast
IMD
Disaster Management
Farmers Loss
Krishna District

More Telugu News