2028 నాటికి 80% ఏసీలు ఏపీలోనే.. దేశానికి 'కూల్ క్యాపిటల్'గా ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్

Nara Lokesh on 70000 Jobs in Sri City Half for Women
  • శ్రీసిటీలో ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు, వాటిలో 50శాతం మహిళలకే వ‌చ్చాయ‌ని వ్యాఖ్య‌
  • 2028 నాటికి దేశంలోని 80శాతం ఏసీలు ఏపీలోనే తయారీ లక్ష్యమ‌న్న మంత్రి
  • యువత కోసం మే చివరిలో 'నైపుణ్యం' పేరుతో ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్
  • రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని వెల్ల‌డి
  • ఏపీని దేశానికి 'కూల్ క్యాపిటల్'గా తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్
ఏపీని దేశంలోనే కీలక పారిశ్రామిక హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, త్వరలోనే రాష్ట్రాన్ని 'భారతదేశపు కూల్ క్యాపిటల్'గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీసిటీలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థ 'క్యారియర్' యూనిట్ ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80 శాతం ఎయిర్ కండిషనర్లను (ఏసీ) ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీసిటీ సాధించిన ప్రగతిని వివరిస్తూ... "సుమారు 8,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఏటా 6 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అందులో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయం" అని లోకేశ్ తెలిపారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు విభిన్న రంగాల్లో శ్రీసిటీ 'మేక్ ఇన్ ఇండియా', 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్'కు ప్రతీకగా నిలుస్తోందని, క్యారియర్ రాకతో ఈ ప్రగతి ప్రస్థానంలో మరో మైలురాయి చేరిందని ఆయన పేర్కొన్నారు.

ఏపీని ఏసీ తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంపై మాట్లాడుతూ.. "ఇప్పటికే 9 ప్రముఖ ఏసీ తయారీ కంపెనీలు, 30కి పైగా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఎకోసిస్టమ్‌లో సుమారు రూ. 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2027 నాటికి దేశంలోని 60% ఏసీలను ఇక్కడే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు క్యారియర్ రాకతో 2028 నాటికి 80% లక్ష్యాన్ని చేరుకుంటాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి క్లస్టర్ ఆధారిత వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు మంత్రి వివరించారు. "భవిష్యత్తు మొత్తం ఎకోసిస్టమ్స్, క్లస్టర్లదే. ఒక ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులు, పరికరాల నుంచి పూర్తిస్థాయి తయారీ వరకు ఒకేచోట ఉండేలా వర్టికల్ ఇంటిగ్రేషన్‌తో పాటు, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ వంటి అంశాలతో హారిజాంటల్ ఇంటిగ్రేషన్‌పైనా దృష్టి సారించాం" అని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఏసీ క్లస్టర్, గ్లాస్ క్లస్టర్, స్పేస్ సిటీ, పునరుత్పాదక ఇంధన క్లస్టర్, డేటా సెంటర్ క్లస్టర్ వంటివి వీటిలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలక నిర్ణయాన్ని లోకేశ్ ప్రకటించారు. "యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు 'నైపుణ్యం' పేరుతో ఒక సంభాషణ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Conversational AI) స్కిల్ అసెస్‌మెంట్ పోర్టల్‌ను ఈ మే నెలాఖరులోగా ప్రారంభిస్తున్నాం" అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

Go Back to Shorts
Nara Lokesh
Sri City
Andhra Pradesh
AP Industries
Air Conditioner Manufacturing
Make in India
Naipunya Skill Assessment
Industrial Clusters
Job Creation
Women Employment

More Telugu News