తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది: పీవీఎన్ మాధవ్
- ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హర్షం
- మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న మాధవ్
- అభివృద్ది, జాతీయ భద్రతకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతం ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై, 'వికసిత్ భారత్' లక్ష్యంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిందని తెలిపారు. తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో, కేరళలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరగడం శుభపరిణామమని విశ్లేషించారు.
అభివృద్ధి, జాతీయ భద్రత మరియు పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు, డిజిటల్ పురోగతి పట్ల యువత, మహిళలు మరియు రైతులు చూపిన మద్దతే ఈ చారిత్రాత్మక విజయానికి కీలకమని ఆయన వెల్లడించారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ గారి వ్యూహరచనపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని మాధవ్ తెలిపారు. ఈ విజయానికి నిరంతరం కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో కూడా బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఏకమై ముందుకు రావాలని, మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా మారుతుందని పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.