రామ్ చరణ్ 'పెద్ది' లుక్ వెనుక రహస్యం ఇదే.. 16 నెలల కష్టం!

How Ram Charan Became Desi Pehalwan For Peddi In 16 Months
  • పెద్ది సినిమా కోసం మూడు విభిన్న రూపాల్లో కనిపించనున్న రామ్ చరణ్
  • గ్రీక్ గాడ్ లా కాకుండా దేశీ పహిల్వాన్ లా కనిపించాలని దర్శకుడి సూచన
  • గద, కుస్తీ వంటి సంప్రదాయ పద్ధతుల్లో 16 నెలల పాటు కఠోర శిక్షణ
  • కఠినమైన శాకాహార డైట్, కార్బ్ సైక్లింగ్ విధానంతో శరీరాకృతిలో మార్పులు
  • మూడో లుక్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అంటున్న ఫిట్‌నెస్ ట్రైనర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం 'పెద్ది' కోసం అసాధారణ రీతిలో సిద్ధమవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ శారీరకంగా ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఒకే పాత్ర కోసం ఏకంగా మూడు విభిన్నమైన రూపాల్లో కనిపించనుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత 16 నెలలుగా రామ్ చరణ్‌కు శిక్షణ ఇస్తున్న ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ రక్కేష్ ఉద్దియార్, చరణ్ మేకోవర్ వెనుక ఉన్న కష్టం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "'పెద్ది'లో ప్రధాన పాత్ర ఎలా ఉండాలనే దానిపై దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఆ పాత్రధారి 'గ్రీక్ గాడ్' లాంటి సిక్స్ ప్యాక్ బాడీతో కాకుండా, ఒక అచ్చమైన 'దేశీ పహిల్వాన్'లా సహజంగా కనిపించాలని చెప్పారు" అని వివరించారు.

గదతో శిక్షణ.. సూర్య నమస్కారాలు
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రక్కేష్ ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. వారంలో శిక్షణను రెండు రకాలుగా విభజించారు. "సోమ, బుధ, శుక్రవారాల్లో ఫాస్టింగ్ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్ ఉండేది. మంగళ, గురు, శనివారాల్లో ఫంక్షనల్ మూవ్‌మెంట్, కుస్తీ వ్యాయామాలు, మొబిలిటీ ఎక్సర్‌సైజ్‌లు చేయించాము" అని తెలిపారు. అంతేగాక‌ గదతో శిక్షణ, సూర్య నమస్కారాలు, తాడు లాగడం, అఖాడా తరహా డ్రిల్స్ వంటి సంప్రదాయ పద్ధతులను కూడా అనుసరించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆహారం విషయంలో సవాళ్లు
ఆహారం విషయంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయని రక్కేష్ తెలిపారు. "చరణ్ అప్పటికే 50 నుంచి 60 శాతం శాకాహారం తీసుకుంటున్నారు. కానీ, శిక్షణ సమయంలో ఆయన్ను పూర్తి శాకాహారిగా మార్చడం చాలా కష్టమైంది. మేం 'కార్బ్ సైక్లింగ్' అనే పద్ధతిని అనుసరించి రోజుకు 1,800 నుంచి 2,500 క్యాలరీల డైట్ ప్లాన్ ఇచ్చాం. కొన్ని రోజులు తక్కువ కార్బ్స్, కొన్ని రోజులు ఎక్కువ కార్బ్స్ ఉండేలా చూసుకున్నాం" అని డైట్ ప్లాన్ గురించి వివరించారు.

సినిమా ప్రారంభంలో పాత్ర ఒక సాధారణ పల్లెటూరి యువకుడిగా, సన్నగా కనిపించాల్సి ఉంటుంది. దీనికోసం చరణ్‌ను దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు క్యాలరీ డెఫిసిట్ డైట్‌లో ఉంచి బరువు తగ్గించినట్లు ట్రైనర్ వెల్లడించారు. క్రమశిక్షణ విషయంలో చరణ్ అంకితభావం అద్భుతమని, ఉదయం 4 గంటలకే తనకు కాల్ వచ్చేదని రక్కేష్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌కు ముందే శిక్షణ పూర్తిచేసి, సెట్‌కు వెళ్లే దారిలో కారులోనే మొదటి మీల్ తీసుకునేవారని తెలిపారు.

ఈ మొత్తం ప్రయాణంలో సమన్వయం కోసం చెఫ్, డాక్టర్, డైటీషియన్, బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందితో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు రక్కేష్ చెప్పారు. షూటింగ్ సమయంలో చరణ్ ఆరోగ్యం, ఆహారం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ గ్రూప్‌లో నిరంతరం చర్చిస్తూ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. చరణ్ శరీరాకృతి కోసం నేను దాదాపు ఒక ఏడాది నాలుగు నెలలు కేటాయించాను. ఆయన మూడో లుక్ అభిమానులకు కచ్చితంగా ఒక పెద్ద సర్‌ప్రైజ్ అవుతుంది" అని రక్కేష్ ఉద్దియార్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Ram Charan
Desi Pehalwan
Peddi
Vegetarian Diet
Weight Training
Surya Namaskar

More Telugu News