Ponguleti Srinivas Reddy: శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. మార్షల్స్‌తో తోపులాట!

Ponguleti Heat at Legislative Council BRS MLCs Protest
షార్ట్స్‌లో చూడండి

తెలంగాణ శాసనమండలి వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి భవనం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో మండలి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


'మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి', 'అక్రమాలకు బాధ్యత వహించాలి', 'ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని ఎమ్మెల్సీలు మండిపడ్డారు.


సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లకార్డులను వెనక్కి తీసుకోవాలని మార్షల్స్ పదే పదే కోరినప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో మార్షల్స్, ఎమ్మెల్సీల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనంతరం మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని... సభ లోపల, బయట తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

Go Back to Shorts
Ponguleti Srinivas Reddy
Telangana Legislative Council
BRS MLC Protest
Ragava Constructions
Stone Crusher Controversy
Telangana Politics
MLC Clash
Kotwalguda
Shamshabad
Telangana Government

More Telugu News