Kal Somani: ఎవరీ కల్ సోమానీ..? రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యంలో హేమాహేమీలు!

Kal Somani Leads Rajasthan Royals Acquisition
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఒక చరిత్రాత్మక ఒప్పందం ఖరారైంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.13,500 కోట్లు) అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన టెక్ పారిశ్రామికవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని ఓ కన్సార్టియం, ఈ జట్టులో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కాగా, ఇది లీగ్‌లోనే అతిపెద్ద యాజమాన్య బదిలీ ఒప్పందంగా నిలిచింది. అయితే, ఈ భారీ డీల్‌కు సారథ్యం వహిస్తున్న కల్ సోమానీ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అమెరికాలోని స్కాట్స్‌డేల్ కేంద్రంగా పనిచేసే కల్ సోమానీ, టెక్నాలజీ రంగంలో సుప్రసిద్ధులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎడ్-టెక్, డేటా ప్రైవసీ వంటి రంగాల్లో ఆయనకు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 'ఇంట్రాఎడ్జ్', 'ట్రూయో' వంటి విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలను ఆయన స్థాపించారు. ముఖ్యంగా ఏఐ గవర్నెన్స్, డేటా భద్రత విషయంలో టెక్ వర్గాల్లో సోమానీని ఒక నిపుణుడిగా పరిగణిస్తారు. టెక్నాలజీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆయన, క్రీడా రంగంలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే అమెరికాలోని మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌లో సహ-యజమానిగా ఉన్న సోమానీ, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు టైగర్ వుడ్స్, రోరీ మెక్‌ల్రాయ్ ప్రారంభించిన 'టీజీఎల్' గోల్ఫ్ లీగ్, 'టీఎంఆర్ డబ్ల్యూ' స్పోర్ట్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు.

రాజస్థాన్ రాయల్స్‌తో సోమానీ బంధం కొత్తదేమీ కాదు. 2021లోనే ఆయన ఈ ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుడిగా చేరారు. అప్పుడే ఐపీఎల్ భవిష్యత్ వృద్ధిపై ఆయన బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన నాయకత్వం వహిస్తున్న కన్సార్టియం వెనుక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యాపార కుటుంబాలు ఉండటం విశేషం. వీరిలో వాల్‌మార్ట్ సంస్థల వారసుడు, డెన్వర్ బ్రాంకోస్ ఫుట్‌బాల్ జట్టు యజమాని రాబ్ వాల్టన్ ఒకరు. 110 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో అమెరికాలోనే అత్యంత సంపన్న క్రీడా యజమానిగా ఆయనకు పేరుంది. అలాగే, ఫోర్డ్ మోటార్ కంపెనీ వారసులైన హాంప్ కుటుంబం కూడా ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉంది.

టెక్నాలజీ, క్రీడా రంగాల్లో తనకున్న విస్తృతమైన నెట్‌వర్క్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మరింత బలోపేతం చేయాలని సోమానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో కేవలం 67 మిలియన్ డాలర్లకే అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్, నేడు 1.63 బిలియన్ డాలర్ల విలువ పలకడం ఐపీఎల్ బ్రాండ్ విలువకు నిదర్శనంగా నిలుస్తోంది. కొత్త యాజమాన్య మార్పులు 2026 ఐపీఎల్ సీజన్ తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Go Back to Shorts
Kal Somani
Rajasthan Royals
IPL
Indian Premier League
Rob Walton
Hamp family
TGL Golf League
TMRW Sports

More Telugu News