Vijay Dahiya: హేడెన్ తర్వాత.. టైటాన్స్ కోచింగ్ టీమ్‌లోకి మరో కీలక నియామకం

Gujarat Titans Appoint Vijay Dahiya as Assistant Coach
  • గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా
  • టీమిండియా మాజీ వికెట్ కీపర్‌గా, కోచ్‌గా దహియాకు మంచి అనుభవం
  • ఇటీవలే బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్‌ను నియమించిన ఫ్రాంచైజీ
  • ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోచింగ్ బృందాన్ని పటిష్ఠం చేస్తున్న టైటాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ తమ కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ విజయ్ దహియాను తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకంతో ఫ్రాంచైజీ కోచింగ్ బృందం మరింత బలోపేతమైంది.

భారత క్రికెట్‌లో విజయ్ దహియా సుపరిచితమైన పేరు. టీమిండియా తరఫున 2 టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆయన, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్‌ వైపు మళ్లారు. ఆయన మార్గదర్శకత్వంలో 2007–08 సీజన్‌లో ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి పలు దేశవాళీ, ఐపీఎల్ జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఇటీవలే ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించిన టైటాన్స్, ఇప్పుడు దహియాను కూడా చేర్చుకుని సపోర్ట్ స్టాఫ్‌ను మరింత శక్తిమంతం చేసింది.

2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ అత్యంత నిలకడైన జట్లలో ఒకటిగా నిలిచింది. ఆడిన తొలి నాలుగు సీజన్లలో మూడుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరడమే కాకుండా, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఇప్పుడు పటిష్ఠ‌మైన కోచింగ్ బృందంతో ఐపీఎల్ 2026 కోసం తమ సన్నాహాలను వేగవంతం చేస్తోంది.
Vijay Dahiya
Gujarat Titans
IPL 2026
Indian Premier League
Matthew Hayden
Cricket Coaching
Indian Cricket
GT Coaching Team
Delhi Ranji Trophy

More Telugu News