Ponguleti Srinivas Reddy: కేటీఆర్, హరీశ్‌రావువి అన్నీ అబద్ధాలే: కాళేశ్వరం వైఫల్యాలపై మంత్రి పొంగులేటి

Ponguleti Accuses KTR Harish Rao of Misleading Public on Irrigation Projects
  • ప్రాజెక్టులపై కేటీఆర్, హరీశ్ వ్యాఖ్యలు వాస్తవ దూరమన్న పొంగులేటి
  • లక్ష కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని విమర్శ
  • రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వ్యాఖ్య

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని విమర్శించారు. ప్రాజెక్టులపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవ దూరమని, ప్రజలను తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని ఆయన ఆక్షేపించారు. 


కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1.08 లక్షల కోట్ల అంచనాతో నిర్మించి, కేవలం 110 టీఎంసీల నీటిని మాత్రమే అందుబాటులోకి తీసుకురావడం గత పాలకుల అసమర్థతకు నిదర్శనమని పొంగులేటి మండిపడ్డారు. ఎన్నికలకు ముందే బ్యారేజీలు కుంగిపోయాయని అన్నారు. ఆ తప్పిదాల నుంచి తప్పుకోవడానికే ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య 'ఫెవికాల్ బంధం' ఉందన్న విషయం బహిరంగ రహస్యమేనని, అందుకే వారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇవ్వాల్సింది పోయి, కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం దురదృష్టకరమని పొంగులేటి అన్నారు. తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతుందని, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రైతులకు మేలు చేకూర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు.

Ponguleti Srinivas Reddy
KTR
Harish Rao
Kaleshwaram Project
Telangana projects
BRS government
Congress party
Telangana irrigation
Telangana politics
Project failures

More Telugu News