Sun: సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు... మానవాళికి ముప్పు ఉందా?

Sun Massive Explosions Threat to Humanity
  • శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తూ సూర్యుడి ఉపరితలంపై కేవలం ఒకే రోజులో 17 భారీ పేలుళ్లు 
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో హై-ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అంతరాయంతో ‘రేడియో బ్లాక్అవుట్’ నమోదైన వైనం
  • రాబోయే రోజుల్లో మరింత బలమైన సౌర తుపానులు సంభవించే అవకాశముందంటున్న నిపుణులు
  • ఇంటర్నెట్ నుంచి బ్యాంకింగ్ వరకు అనేక డిజిటల్ వ్యవస్థలు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
సూర్యుడు ప్రస్తుతం అత్యంత చురుకైన దశలోకి ప్రవేశిస్తున్నాడు. శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తూ సూర్యుడి ఉపరితలంపై కేవలం ఒకే రోజులో 17 భారీ పేలుళ్లు నమోదయ్యాయి. ఇవి సాధారణ సౌరజ్వాలలు కావు, అత్యంత శక్తిమంతమైన ‘ఎక్స్-క్లాస్’ శ్రేణికి చెందినవి. తాజాగా కనిపించిన AR4366 అనే విస్తారమైన సన్‌స్పాట్ ఈ ఉగ్ర పరిణామాలకు కేంద్రంగా మారింది. దాని విస్తీర్ణం మరియు చురుకుదనం దృష్ట్యా, ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని 1859లో ప్రపంచాన్ని కుదిపేసిన క్యారింగ్ టన్ ఈవెంట్ పరిస్థితులతో పోలుస్తున్నారు. ఈ పేలుళ్ల నుంచి వెలువడే అయస్కాంత మేఘాలు భూమి వైపు దూసుకొస్తే, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్ర అంతరాయానికి గురయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

సూర్యుడి అంతర్భాగంలో అయస్కాంత క్షేత్రాల మధ్య ఏర్పడే తీవ్రమైన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు సౌరజ్వాలలు ఉద్భవిస్తాయి. ఫిబ్రవరి 1న సంభవించిన శక్తిమంతమైన పేలుడు ఇప్పటికే ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో హై-ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అంతరాయం కలిగి ‘రేడియో బ్లాక్అవుట్’ నమోదైంది. ఇది కేవలం ప్రారంభ సంకేతమేనని, రాబోయే రోజుల్లో మరింత బలమైన సౌర తుపానులు సంభవించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ తుపానులు నేరుగా భూమిని తాకితే, కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు దెబ్బతినడమే కాకుండా, మనం రోజువారీగా వినియోగించే జీపీఎస్ సేవలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఈ ప్రభావం కేవలం కమ్యూనికేషన్ వరకే పరిమితం కాకుండా, సౌర తుపానులతో కూడిన ‘కరోనల్ మాస్ ఈజెక్షన్’ (సీఎంఇ) అనే ప్లాస్మా మేఘాలు భూమి మాగ్నెటోస్ఫియర్‌ను తీవ్రంగా కుదిపేస్తాయి. దాంతో విద్యుత్ గ్రిడ్లలో ఓవర్లోడ్ పెరిగి, విస్తృత స్థాయిలో బ్లాక్అవుట్లు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. 1859లో జరిగిన క్యారింగ్టన్ ఘటనలో టెలిగ్రాఫ్ వైర్లకు మంటలు వ్యాపించిన చరిత్ర వుంది. నేటి సాంకేతిక యుగంలో అలాంటి సంఘటన పునరావృతమైతే, ఇంటర్నెట్ నుంచి బ్యాంకింగ్ వరకు అనేక డిజిటల్ వ్యవస్థలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు సూర్యుడి చలనంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. సూర్యుడు తన 11 ఏళ్ల చక్రంలో అత్యంత చురుకైన ‘సోలార్ మాక్సిమం’ దశకు చేరువవుతున్నందున, శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Sun
Solar flares
Solar storm
Coronal mass ejection
CME
AR4366
Carrington event
NASA
ISRO
Radio blackout

More Telugu News