Jeffrey Epstein: ఎప్‌స్టీన్ కేసులో సంచలనం.. బాధితుల్లో భారత్‌ మహిళ!

Jeffrey Epstein Case Indian Woman Among Victims
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో పెను సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయ విభాగం (DOJ) తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బాధితుల్లో ఒకరు భారత్‌లో ఉన్నట్లు తేలింది. ఆమెకు పరిహారం అందించి, ఆదుకునేందుకు అమెరికా అధికారులు ప్రయత్నించినట్లు ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

2020 జనవరి 13 నాటి అంతర్గత ఈ-మెయిల్‌లో ఈ వివరాలు ఉన్నాయి. 'EFTA00038425' నంబర్ గల ఈ డాక్యుమెంట్‌లో "చివరగా.. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న ఆమెకు మనం ఎలా సహాయం చేయగలం? ఆమెకు ఏమైనా వనరులు అందించగలమా?" అని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు అధికారులను ప్రశ్నించారు. దీనికి ఓ అధికారి స్పందిస్తూ "భారత్‌లో ఉన్న ఆ వ్యక్తి చిరునామా, సంప్రదింపుల వివరాలు అందిస్తే, అక్కడి మా రాయబార కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటాం" అని బదులిచ్చారు.

బాధితులకు పరిహారం అందించే నిధి నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందించాలని, అవసరమైతే థెరపీ సెషన్లకు కూడా ఏర్పాట్లు చేయాలని ఈ-మెయిల్‌లో చర్చించుకున్నారు. బాధితురాలు దరఖాస్తు పూర్తిచేస్తే ఆ పత్రాలను ఎఫ్‌బీఐకి పంపనున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ సంభాషణ జరిగిన సమయంలో ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకొని కొన్ని నెలలు మాత్రమే గడిచింది.

అయితే, ఈ పత్రాల్లో బాధితురాలి పేరు, జాతీయత వంటి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు. దీంతో భారత్‌లో ఉన్న ఆ మహిళ ఎవరు, అమెరికా అధికారులు ఆమెను సంప్రదించగలిగారా, లేదా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Go Back to Shorts
Jeffrey Epstein
Epstein case
India
Victim
Sex trafficking
DOJ
US Embassy
Financial assistance
Therapy

More Telugu News