Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం పాకిస్థాన్‌ ప్రధానికి ప్రపంచ మాజీ కెప్టెన్ల లేఖ.. కపిల్ దేవ్, గవాస్కర్ కూడా!

Imran Khan Former Captains Write to Pakistan PM
  • రావల్పిండి జైల్లో అనారోగ్యంతో ఉన్న ఇమ్రాన్ ఖాన్
  • పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధానికి మాజీ క్రికెటర్ల పిటిషన్
  • ఇమ్రాన్ ఖాన్‌‍కు వైద్య సహాయం అందించాలని మాజీల విజ్ఞప్తి
  • సంతకాలు చేసిన 14 మందిలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్
1992 ప్రపంచ కప్ సాధించిన జట్టుకు సారథ్యం వహించిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు క్రికెట్ ప్రపంచం నుంచి మద్దతు లభిస్తోంది. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 14 మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు సంతకాలతో కూడిన ఒక పిటిషన్ పంపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందనే నివేదికల నేపథ్యంలో ఈ లేఖ రాశారు. జైల్లో మెరుగైన వైద్య చికిత్స అందించాలని వారు ఈ లేఖలో కోరారు.

ఇమ్రాన్ ఖాన్ కుడికన్ను చూపు 85 శాతం కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. రావల్పిండి జైల్లో ఉన్న సిబ్బంది ఆయన పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జైలు గదిలో సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉండటంతో కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని సమాచారం. పాకిస్థాన్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో ఇవి వెల్లడయ్యాయి. ఈ పరిణామాలపై స్పందించిన సుప్రీంకోర్టు ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఈ అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు చట్టపరంగా అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని వారు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు రాసిన లేఖపై గ్రెగ్ చాపెల్, బెలిండా క్లార్క్, మైఖేల్ అథర్టన్, నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లీ, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ సంతకాలు చేశారు.

అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు ఎవరూ ఈ పిటిషన్‌పై సంతకం చేయకపోవడం గమనార్హం. గత వారం, వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది సహా పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్‌కు సరైన వైద్య సంరక్షణ అందించాలని అధికారులను కోరారు.
Imran Khan
Pakistan
Shehbaz Sharif
Kapil Dev
Sunil Gavaskar
Former Captains Letter
Medical Treatment

More Telugu News