USA Cricket Team: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెట్ జట్టు

USA Cricket Team Visits Tirumala Venkateswara Swamy Temple
  • టీ20 వరల్డ్ కప్ కోసం వచ్చిన అమెరికా జట్టు
  • అమెరికా జట్టులో ఉన్న తెలుగు కుర్రాడు సాయితేజ
  • దర్శనం బాగా జరిగిందన్న కెప్టెన్ మోనాంక్ పటేల్

టీ20 వరల్డ్ కప్ కోసం వచ్చిన అమెరికా క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జట్టులోని భారత సంతతి ప్లేయర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ, “స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆలయ ప్రాంగణం, పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.


అమెరికా జట్టులో తెలుగు కుర్రాడు సాయితేజ కూడా ఉన్నాడు. ఆయన తండ్రి నాగేశ్వర్ రెడ్డి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి గ్రామానికి చెందినవారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడటంతో సాయితేజ అక్కడే పుట్టి పెరిగాడు. జట్టులో ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్, మహారాష్ట్రకు చెందిన శుభమ్ రంజా, గుజరాత్‌కు చెందిన మోనాంక్ పటేల్ (కెప్టెన్), ముంబైకి చెందిన హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, కర్ణాటక మూలాలున్న సంజయ్ కృష్ణమూర్తి ఉన్నారు.


మరోవైపు, తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం... టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.


నిన్న 73,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23,291 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చింది.

USA Cricket Team
Tirumala
T20 World Cup
Monank Patel
Sai Teja
Venkateswara Swamy
AP Cricket Association
Indian origin players
TTD
Nandyala

More Telugu News