Bandi Sanjay: బీఆర్ఎస్ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠగా కరీంనగర్ మేయర్ ఎన్నిక.. హోటల్లో సమావేశమైన బండి సంజయ్

Karimnagar Mayor Election Intensifies with BRS Twist Bandi Sanjay Meeting
షార్ట్స్‌లో చూడండి
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు మేయర్, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చిన చోట ఎన్నిక సాఫీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ ఏర్పడిన చోట మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను దక్కించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. చిత్రవిచిత్రమైన పొత్తులు కుదుర్చుకుంటున్నాయి.

ఏడు కార్పొరేషన్‌లలో కరీంనగర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ 66 స్థానాలకు గాను బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3, ఇతరులు 10 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియోతో కలిపి సభ్యుల సంఖ్య 69కి చేరగా, మేయర్ పదవికి 35 మంది మద్దతు అవసరం. ఎన్నికల అనంతరం బీజేపీలో కొందరు కార్పొరేటర్లు చేరడంతో, బీజేపీ బలం 34 వరకు చేరుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

అయితే 14 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్, స్వతంత్రులు, బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే, బీఆర్ఎస్ మద్దతు తీసుకోకూడదని పార్టీ రాష్ట్రస్థాయి నేతల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కూడా కీలక ప్రకటన చేసింది. మేయర్ ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది తటస్థంగా ఉంటే, ఓటింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య 59కి తగ్గి, మేజిక్ ఫిగర్ 30గా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా, బండి సంజయ్ కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో పార్టీకి చెందిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మేయర్ ఎన్నిక సమయంలో ఎలా వ్యవహరించాలో ఆయన సూచనలు చేశారు. సమావేశం అనంతరం కార్పొరేటర్లతో కలిపి ఆయన కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్నారు.

జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక కూడా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వర్గం సభ్యులు, కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం సభ్యులు వేర్వేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జగిత్యాలలో 50 స్థానాలకు గాను కాంగ్రెస్ 23, జీవన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ 17 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది.
Go Back to Shorts
Bandi Sanjay
Karimnagar Mayor Election
BRS
BJP
Congress
Telangana Municipal Elections
Jagityala

More Telugu News