Tarique Rahman: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ప్రభంజనం.. ప్రధానిగా తారిక్ రెహమాన్!

Tarique Rahman BNP Wins Bangladesh Election Set to be Prime Minister
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 151 సీట్ల మార్క్‌ను దాటి, స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం అధికారికంగా పూర్తి ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, బీఎన్‌పీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

2024 జులైలో జరిగిన భారీ ప్రజా ఉద్యమం ఫలితంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుమారు 18 నెలల మధ్యంతర పాలన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎన్నికలు జరిగాయి.

నిన్న (12న) జరిగిన పోలింగ్‌లో మొత్తం 300 స్థానాలకు గాను 299 చోట్ల ఎన్నికలు జరిగాయి. అనధికారిక ఫలితాల ప్రకారం బీఎన్‌పీ 158 నుంచి 197 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి ఘన విజయం సాధించారు. మరోవైపు, జమాతే ఇస్లామీ పార్టీ సుమారు 42 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 60.7 శాతం పోలింగ్ నమోదైంది.

"ఈ రోజు కోసం బంగ్లాదేశ్ ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు ప్రజలు తమ హక్కులను తిరిగి పొందారు" అని ఓటు వేసిన అనంతరం తారిక్ రెహమాన్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరిగిన 'జులై చార్టర్' రాజ్యాంగ సంస్కరణల రిఫరెండానికి కూడా 72.9శాతం ప్రజలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. త్వరలోనే తారిక్ రెహమాన్ ప్రధానిగా బీఎన్‌పీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Go Back to Shorts
Tarique Rahman
Bangladesh election
BNP victory
Bangladesh Nationalist Party
Sheikh Hasina
Mohammad Yunus
Bangladesh politics
Awami League
Jamaat-e-Islami

More Telugu News