Josh Hazlewood: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ.. మ‌రో స్టార్ పేసర్ ఔట్

Aussie pacer Josh Hazlewood ruled out of T20 WC
షార్ట్స్‌లో చూడండి
శ్రీలంక, భారత్ వేదికగా రేప‌టి నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయంపై ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ టోనీ డొడెమైడ్ మాట్లాడుతూ.. "సూపర్ 8 దశ నాటికి హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశించాం. కానీ, తాజా నివేదికల ప్రకారం అతను కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ దశలో అతనిపై ఒత్తిడి పెంచడం ప్రమాదకరం" అని వివరించారు. ఈ నెల‌ 11న కొలంబోలో ఐర్లాండ్‌తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుండగా, కేవలం ఐదు రోజుల ముందు ఈ ప్రకటన రావడం గమనార్హం.

ప్రస్తుతానికి హేజిల్‌వుడ్ స్థానంలో వెంటనే మరో ఆటగాడిని ఎంపిక చేయడం లేదని, టోర్నీలో పరిస్థితులు, అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని డొడెమైడ్ తెలిపారు. 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలవడంలో హేజిల్‌వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే మరో కీలక పేసర్ పాట్ కమిన్స్ కూడా గాయంతో జట్టుకు దూరమవ్వడంతో ఆసీస్ పేస్ దళం బలహీనపడింది.

అయితే, ఈ పరిణామాలపై కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. "మా జట్టులో సమర్థులైన ఆటగాళ్లకు కొదవలేదు. మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ వంటి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. పరిస్థితులకు తగ్గట్టు సరైన జట్టును ఎంపిక చేస్తాం" అని ధీమా వ్యక్తం చేశాడు.


Go Back to Shorts
Josh Hazlewood
Australia
T20 World Cup
Pat Cummins
Mitchell Marsh
Cricket
Injury
Team Selection
Marcus Stoinis
Cameron Green

More Telugu News