కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను అరెస్టు చేయాలి: బీజేపీకి రేవంత్ రెడ్డి డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను అరెస్టు చేయాలి: బీజేపీకి రేవంత్ రెడ్డి డిమాండ్

Revanth Reddy Demands Arrest of KCR KTR Harish Rao
  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమన్న ముఖ్యమంత్రి
  • ఏపీలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్య
  • అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు వేతనం కట్ చేయవద్దా అని ప్రశ్న
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్, హరీశ్ రావును, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో కేటీఆర్‌ను అరెస్టు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని విమర్శించారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులను అరెస్టు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ నుంచే హామీ ఇచ్చి నెరవేర్చారని అన్నారు. ఏపీలో అధికారం కోల్పోయినా మాట తప్పలేదని అన్నారు. ఏపీ పెట్టుబడిదారులు అడ్డుపడినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని, కానీ ప్రజల ఆకాంక్షలను వారు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన అందిస్తుంటే తమపై కొంతమంది విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని ఆ కుటుంబం దాడి చేస్తోందని మండిపడ్డారు. 

కేసీఆర్ నెల నెలా వేతనం తీసుకుంటున్నారు కానీ సభకు మాత్రం రావడం లేదని, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని ఆయనకు వేతనం కట్ చేయవద్దా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను బీఆర్ఎస్ గెలిపించిందని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తీసుకువచ్చిందని, కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను అరెస్టు చేశాకే వారు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు మీరేం చేశారని బీజేపీ ప్రశ్నిస్తోందని, కానీ పదేళ్లు వారేం చేశారో చెప్పడం లేదని చురక అంటించారు. మోదీ, అమిత్ షా ఎవరిని తీసుకొచ్చినా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు బీజేపీ గెలవదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.

అలాంటప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు ఎందుకోసం వచ్చినట్లని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సీబీఐ విచారణ చేయించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం స్పందించలేదని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసులో చర్యలు తీసుకోవాలని కోరినా స్పందించడం లేదని ఆరోపించారు. మెట్రో రైలు మంజూరు చేయలేదని, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని మోదీ, అమిత్ షా కూడా అన్నారని గుర్తి చేశారు. 

తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. వెయ్యి బస్సులకు ఆడబిడ్డలను యజమానులుగా చేశామని, రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డల చీరల్లో కూడా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.
Advertisement
Revanth Reddy
KCR arrest
KTR arrest
Harish Rao arrest
Telangana BJP
Kaleshwaram project scam

More Telugu News