Ponnam Prabhakar: మంత్రి పొన్నం బావమరిదికి 'హ్యాండ్' ఇచ్చిన కాంగ్రెస్!

Janagaon Congress Rejects Minister Ponnams Relative for Election Ticket
  • పెద్ది నవీన్ కుమార్ గౌడ్‌కు దక్కని టికెట్
  • అడ్డుపడ్డ 'స్థానికేతర' నినాదం
  • పొన్నం, మహేశ్ గౌడ్ ప్రయత్నాలు విఫలం
  • రెబల్‌గా బరిలోకి దిగే ఛాన్స్!
జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్‌కు చుక్కెదురైంది. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆయన వేసిన ప్లాన్ తలకిందులైంది. సోమవారం విడుదలైన అభ్యర్థుల తుది జాబితాలో నవీన్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు షాక్‌కు గురయ్యారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ భార్యకు తమ్ముడైన నవీన్ కోసం స్వయంగా మంత్రి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, నవీన్ 'స్థానికేతరుడు' (హనుమకొండకు చెందిన వ్యక్తి) అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. నవీన్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ సంతకాల సేకరణ చేపట్టి మరీ అధిష్ఠానానికి పంపారు.

స్థానికుల ఒత్తిడికి తలొగ్గిన ఎంపిక కమిటీ చివరకు బుక్క బాల భరద్వాజ్‌ను 6వ వార్డు అభ్యర్థిగా ఖరారు చేసింది. గతంలో రెండుసార్లు పార్టీ కోసం త్యాగం చేసి నామినేషన్లు ఉపసంహరించుకున్న బాల భరద్వాజ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమిటీ భావించింది.

టికెట్ నిరాకరణతో నవీన్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన తండ్రి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేత వెంకటనారాయణ గౌడ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా లేదా మరో పార్టీ తరపునైనా నవీన్‌ను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జనగామ 6వ వార్డులో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి గట్టి పోటీ తప్పదు.  

జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గానూ కాంగ్రెస్ 26 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా సీపీఎంకు 3, సీపీఐకి 1 వార్డు కేటాయించారు. టికెట్లు రాని మరికొంతమంది అసమ్మతి నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నవీన్ కుమార్ గౌడ్ ఒకవేళ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే, మంత్రి కుటుంబంలోనే రాజకీయ విభేదాలు బయటపడే అవకాశం ఉంది.

More Telugu News

Ponnam Prabhakar
Janagaon Municipality Elections
Peddi Naveen Kumar Goud
Telangana Congress
TPCC Mahesh Goud
Chamala Kiran Kumar Reddy
Ward Elections
Ticket Allocation
Internal Party Conflict
Local Politics