ముస్తాఫిజూర్ ను తప్పించడంపై బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన దేవకీనందన్ ఠాకూర్
- ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్‌ను తొలగించిన బీసీసీఐ
- స్వాగతించిన ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్
- హిందువుల మనోభావాలను కేకేఆర్ విస్మరించిందని విమర్శ
ఈ సందర్భంగా దేవకీనందన్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్ క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడించవద్దని మేం విజ్ఞప్తి చేశాం. మా అభ్యర్థనను మన్నించిన బీసీసీఐకి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ, హిందువుల మనోభావాలను, వారి ఆవేదనను కేకేఆర్ అర్థం చేసుకోలేదు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా, ఆ దేశ క్రికెటర్‌ను జట్టులో ఉంచుకుంది. కనీసం ఒక అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఈ ప్రవర్తన సనాతన ధర్మ ఫౌండేషన్ సభ్యులతో పాటు హిందువులందరినీ బాధించింది" అని అన్నారు.
శనివారం నాడు బీసీసీఐ ఆదేశాల మేరకు, కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ వివాదంపై క్రికెటర్ రింకూ సింగ్ కోచ్ మసూద్ ఉజ్ జాఫర్ అమిని స్పందించారు. క్రీడలను, రాజకీయాలను కలపడం మంచిది కాదని, అది ఆటపై చెడు ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. "ముస్తాఫిజుర్ ముందుగా ఒక క్రికెటర్, ఆ తర్వాతే హిందూ లేదా ముస్లిం. క్రీడాకారులతో రాజకీయం చేయకూడదు. అయితే, ఇది దేశానికి సంబంధించిన నిర్ణయం కాబట్టి, బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.