దిత్వా ఎఫెక్ట్: నేడు ఏపీలోని 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
- దిత్వా తుపాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు
- నెల్లూరు, తిరుపతి సహా నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
- అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న హోంమంత్రి అనిత
అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం దిత్వా తుపాన్ కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తుపాన్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 48 గంటల పాటు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, సహాయక చర్యల నిమిత్తం అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.