Smriti Mandhana: వైరల్ అవుతున్న పలాశ్ చాట్.. స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడానికి ఇదే కారణమా?

Palash Muchhal WhatsApp Chat Leaked Smriti Mandhana Wedding Called Off
  • వాయిదా పడిన స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం
  • తండ్రి అనారోగ్యమే కారణమని ప్రకటించిన కుటుంబసభ్యులు
  • ప్రియుడు పలాశ్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • మరో మహిళతో పలాశ్ చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్
  • ఈ విషయం తెలియడంతోనే మంధాన పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రచారం
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడటం వెనుక అసలు కారణం వేరే ఉందంటూ ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కాబోయే భర్త, సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ మోసం చేయడమే దీనికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ కొన్ని వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పలాశ్‌ ముచ్చల్‌కు, మరో మహిళకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొరియోగ్రాఫర్‌ మేరీ డికోస్టా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత ఇవి రెడ్డిట్‌లో కూడా విస్తృతంగా వ్యాపించాయి. ఈ చాట్ ప్రకారం, పలాశ్ మే నెలలో సదరు మహిళను స్విమ్మింగ్‌కు ఆహ్వానించాడు. స్మృతితో తన బంధం పాతబడిపోయిందని, తనతో డేటింగ్ చేయాలని ఆ మహిళను కోరినట్లు ఆ స్క్రీన్‌షాట్లలో ఉంది. అంతేకాకుండా, మంధాన గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తోంది.

నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో స్మృతి, పలాశ్‌ల వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు గుండెపోటు లక్షణాలు రావడంతో ఆసుపత్రిలో చేర్చారని, అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నామని ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాయి.

అయితే, పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ చాట్ వ్యవహారం స్మృతి దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె, వెంటనే పెళ్లిని రద్దు చేసుకుందని, తండ్రి అనారోగ్యం విషయాన్ని కారణంగా చూపించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై మంధాన లేదా పలాశ్‌ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Indian cricketer
marriage postponed
controversy
whatsapp chat
Meri Dcosta
Sangli
Srinivas Mandhana

More Telugu News