ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
- ఎల్లుండి నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం
- పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరిక
విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి (శుక్రవారం) నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని స్పష్టం చేశారు.