నిద్రలోనే కాటేసిన మృత్యువు.. నెలన్నర పసికందు సహా తండ్రి మృతి
- నిజామాబాద్ జిల్లా కోటగిరిలో విషాద ఘటన
- భారీ వర్షానికి కూలిన పాత ఇంటి గోడ
- నిద్రిస్తున్న తండ్రి, నెలన్నర పాప అక్కడికక్కడే మృతి
- మృతుడు మహేశ్‌గా (24) గుర్తింపు
వివరాల్లోకి వెళితే... కోటగిరికి చెందిన మహేశ్ (24) తన భార్య, నెలన్నర పసికందుతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వారి పాత ఇంటి గోడ పూర్తిగా నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. గాఢ నిద్రలో ఉన్న కుటుంబంపై గోడ శిథిలాలన్నీ పడటంతో మహేశ్‌తో పాటు ఆయన చిన్నారి కుమార్తె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మహేశ్ భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం విని చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.