నౌకాదళ చరిత్రలో నారీశక్తి.. తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా ఆస్థా పూనియా
- భారత నౌకాదళంలో ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందిన తొలి మహిళగా ఆస్థా పూనియా
- ఐఎన్ఎస్ డేగాలో విజయవంతంగా శిక్షణ పూర్తి
- ప్రతిష్ఠాత్మక 'వింగ్స్ ఆఫ్ గోల్డ్' పురస్కారం స్వీకరణ
- లింగ సమానత్వం దిశగా భారత నేవీ కీలక ముందడుగు
- 'నారీశక్తి'ని ప్రోత్సహించడంలో మరో మైలురాయి
ఐఎన్ఎస్ డేగాలో జులై 3న జరిగిన సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవంలో ఆస్థా పూనియా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ కార్యక్రమంలో ఆమె, లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్‌తో కలిసి ఏసీఎన్ఎస్ (ఎయిర్), రియర్ అడ్మిరల్ జనక్ బేవలీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక 'వింగ్స్ ఆఫ్ గోల్డ్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని భారత నౌకాదళం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా హెలికాప్టర్లు, నిఘా విమానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, అత్యంత కీలకమైన ఫైటర్ స్ట్రీమ్‌లోకి ఓ మహిళా పైలట్‌ను తీసుకోవడం ఇదే ప్రథమం. 'నారీశక్తి'ని ప్రోత్సహిస్తూ, నౌకాదళ వైమానిక విభాగంలో (నేవల్ ఏవియేషన్) మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం నిదర్శనమని నేవీ పేర్కొంది. ఆస్థా పూనియా విజయం అడ్డంకులను అధిగమించి, ఓ నూతన శకానికి నాంది పలికిందని ప్రశంసించింది.