పహల్గామ్ దాడి: భారత్‌కు ప్రపంచ దేశాల సంఘీభావం

International Outrage Over Deadly Pahalgham Attack in Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ హేయమైన చర్యలో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల పలు దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటామని, ఉగ్రవాదంపై పోరులో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ బుధవారం స్పందిస్తూ, పహల్గామ్‌లో జరిగినది హేయమైన ఉగ్రదాడి అని పేర్కొన్నారు. వివిధ వర్గాలకు చెందిన అనేక మంది స్త్రీ, పురుషులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాల దుఃఖాన్ని పంచుకుంటున్నామని, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ కూడా ఈ అమానవీయ దాడి నేపథ్యంలో భారత్‌కు తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ అర్థరహిత హింస యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా, భారత్ మంచి మిత్రులని, ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అల్బనీస్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం అందిస్తామని తెలిపారు.

మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి, పహల్గామ్ దాడిని పిరికిపంద చర్యగా ఖండించారు. అమాయకుల హత్య పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దుఃఖ సమయంలో భారత ప్రజలకు అండగా ఉంటామని, ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు ఐక్యంగా నిలుస్తాయని రామ్‌గూలమ్ స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సైతం కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరమని, ఈ కష్ట సమయంలో న్యూజిలాండ్ ప్రజల ఆలోచనలు భారత ప్రజలతోనే ఉన్నాయని ఆయన 'ఎక్స్' లో పేర్కొన్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కూడా పహల్గామ్ దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సింగపూర్ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని తెలిపారు.

మంగళవారం నాడు పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయ ప్రాంతంలో పర్యాటకులపై ఈ దాడి జరిగింది. సమీపంలోని దట్టమైన అడవుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పర్యాటకులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రాథమిక నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.

ఈ దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. లోయ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, అదనపు బలగాలను మోహరించారు.
Go Back to Shorts
Pahalgham Attack
Jammu and Kashmir Terrorism
India
International Condemnation
Emmanuel Macron
Anthony Albanese
Praveen Ramgoolam
Christopher Luxon
Vivian Balakrishnan
Terrorist Attack
Global Support for India

More Telugu News