పాకిస్థాన్‌లో హిందూ మంత్రిపై దాడి
- సింధ్ ప్రావిన్స్‌లో థట్టా జిల్లాలో ఘటన
- మంత్రి ఖేల్ దాస్ కొహిస్తానీ కాన్వాయ్‌పై టమాటలు, బంగాళదుంపలతో దాడి
- తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్
- నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక
సింధ్ రాష్ట్రంలో సాగునీటి అవసరాల కోసం నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గించేలా కేంద్రం చేపట్టిన కాలువల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొహిస్తానీపై దాడి జరిగింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
పంజాబ్ ప్రావిన్స్‌లో గ్రీన్ పాకిస్థాన్ ప్రాజెక్టు కింద 6 సాగునీటి కాలువలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆర్మీతో పాటు పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం కూడా మద్దతిస్తోంది. అయితే, సింధ్ ప్రాంతంలోని అనేక జాతీయవాద పార్టీలు, సంస్థలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. కాలువల నిర్మాణం వల్ల తమ ప్రాంతానికి నీటి కొరత ఏర్పడుతుందని ఆరోపిస్తున్నాయి. కాగా, జమ్షోరో జిల్లాకు చెందిన కొహిస్తానీ 2018లో పీఎంఎల్-ఎన్ టికెట్‌పై ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు. 2024లో మళ్లీ విజయం సాధించి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.