శ్రుతి మించిన సంబరాలు.. గుండు కొట్టించి ఊరేగించిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ గెలవడంతో మధ్యప్రదేశ్ లో యువత వేడుకలు
- ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీస్ వాహనంపై దాడి
- ఛేజ్ చేస్తూ రాళ్లురువ్వారని పోలీసుల ఆరోపణ
- నిందితులకు గుండు కొట్టించి వీధుల్లో ఊరేగించిన పోలీసులు
పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు యువకులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద నిందితులను 12 నెలల వరకు నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆపై అదుపులోకి తీసుకున్న యువకులకు గుండు కొట్టించి, వీధుల్లో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
యువకులకు గుండు కొట్టించి ఊరేగించిన ఘటనపై బాధితుల తల్లిదండ్రులు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజెను ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న యువకులపై ఇలాంటి తీవ్రమైన కేసులు పెట్టడం, గుండు కొట్టించి ఊరేగించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. వాళ్లేమీ సాధారణ నేరస్థులు కారని గుర్తుచేశారు. వేడుకల్లో కొంత అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, దానికి మందలించాలే కానీ ఇలా ఘోరంగా అవమానించడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.