Rishabh Pant: పంత్ మాస్ కొట్టుడు... ఢిల్లీ భారీ స్కోరు

Rishabh Pant flamboyant batting leads DC massive score
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించింది. కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన హిట్టింగ్ తో సొంతగడ్డపై ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. 

పంత్, అక్షర్ పటేల్ అర్ధసెంచరీలు, ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చిన స్టబ్స్ కేవలం 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్ చూస్తే... హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ను ఓపెనర్ గా పంపారు. ధాటిగా ఆడిన మెక్ గుర్క్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేసి సందీప్ వారియర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 11 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాయ్ హోప్ కేవలం 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ దశలో పంత్, అక్షర్ పటేల్ జోడీ సెంచరీకి పైగా పరుగుల భాగస్వామ్యంతో స్కోరుబోర్డును ముందుకు ఉరికించింది. 

అక్షర్ పటేల్ అవుటైనప్పటికీ పంత్ దూకుడు కొనసాగించాడు. ముఖ్యంగా, మోహిత్ శర్మ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో పంత్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 సిక్స్ లు, 1 ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ కు 1 వికెట్ లభించింది.
Go Back to Shorts
Rishabh Pant
Delhi Capitals
Gujarat Titans
Delhi
IPL 2024

More Telugu News