ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లపై గతంలో ఫిర్యాదులు!

EC reportedly transfers officials due to complaints
  • ఏపీలో ఆరుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ ల బదిలీ
  • ఎన్నికల ముంగిట కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
  • గతంలో వీరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు!
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఏపీలో ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం తెలిసిందే. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, గుంటూరు రేంజి ఐజీ పాలరాజు... కృష్ణా జిల్లా రిటర్నింగ్ అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమి, తిరుపతి జిల్లా రిటర్నింగ్ అధికారి లక్ష్మీషాలకు స్థానచలనం కలిగింది. 

అయితే, వీరిపై ఈసీ చర్యలు తీసుకోవడానికి గతంలో వీరిపై వచ్చిన ఫిర్యాదులే కారణమని తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు, ఓటర్ల జాబితా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు రావడం కూడా సదరు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలకు దారితీసినట్టు సమాచారం. 

అనంతపురం ఎస్పీ అన్బురాజన్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమి... వీరిరువురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఉరవకొండ ఓటర్ల జాబితాలో అక్రమాలపై పట్టించుకోలేదని కలెక్టర్ గౌతమిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ గౌతమి బంధువు అని టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 

ఇక, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ గతంలో వివేకా కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీపైనే అక్రమ కేసు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ అన్బురాజన్ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. 

ఇటీవల ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
EC
IPS
IAS
Transfer
Andhra Pradesh

More Telugu News