తాగునీటి సమస్య లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్... ఆందోళన అవసరంలేదు: తెలంగాణ సీఎస్ శాంతికుమారి

Telangana CS Shanti Kumari on drinking water issue
తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే 'సమ్మర్ యాక్షన్ ప్లాన్'ను రూపొందించామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని... ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతీరోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇతర రాష్ట్రాలలోని తాగునీటి సమస్యను తెలంగాణకు కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన కథనాలు వస్తున్నాయని... కానీ రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా, ప్రధాన జలాశయాలు, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌తో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు.

అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో నిర్వహణపరంగా ఉన్న లోపాలను పరిష్కరించినట్లు చెప్పారు. నీటి సమస్యలపై వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుండి ఎమర్జెన్సీ పంపింగ్‌ను చేపడతామన్నారు. హైదరాబాద్ నగరంలోనూ సరిపడా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. కమర్షియల్ అవసరాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు.
Go Back to Shorts
Telangana
shanti kumari
drinking water

More Telugu News