అబ్బ..ఏమి 'షమీ-ఫైనల్'! సచిన్ ప్రశంసలు
- నిన్నటి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన షమీ
- ఈ టోర్నీలో నాలుగోసారి ఐదు లేదా అంతకుమించి వికెట్లు తీసిన వైనం
- 17 ప్రపంచకప్ మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసి అత్యంత వేగవంతమైన బౌలర్గా రికార్డు
- ఇది షమీ-ఫైనల్ అంటూ సచిన్ ప్రశంసలు
మ్యాచ్ ఆసాంతం తన ఆధిపత్యం కొనసాగించిన షమీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది సెమీ ఫైనల్ కాదని షమీ-ఫైనల్ అని చమత్కరించాడు. అటూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించిన టీమిండియాను ‘ఎక్స్’ వేదికగా అభినందించాడు.
కాగా, ఈ వరల్డ్ కప్‌లో షమీ నాలుగు పర్యాయాలు ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మిచెల్ ప్రపంచకప్ మ్యాచుల్లో మూడు సార్లు ఐదు, అంతకుమించి వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మిచెల్ స్టార్క్ ఇటీవల ఈ టోర్నీలోనే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. మిచెల్ 19 ప్రపంచకప్ వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీయగా షమీ 17 మ్యాచులకే ఈ ఫీట్ సాధించాడు.