మహారాష్ట్రలో ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకుపోయిన దొంగలు
- నాసిక్ లో ఘటన.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
- లారీలో వచ్చి మెషిన్ ను ఎత్తుకెళ్లిన వైనం
- సమీపంలోనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నా వెరవని దొంగలు
ఆదివారం తెల్లవారుజామున నలుగురు దుండగులు ఏటీఎంలోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. ముఖాలు కనిపించకుండా మాస్క్ లు వేసుకుని, రెయిన్ కోట్లు ధరించి ఏటీఎం మెషిన్ ను తెరిచేందుకు విఫల యత్నం చేశారు. ఆపై తమ వెంట తెచ్చుకున్న లారీలోకి ఏటీఎం మెషిన్ ను ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. మరుసటి రోజు ఉదయం ఏటీఎం సెంటర్ లో మెషిన్ లేకపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీల ఫుటేజ్‌ని సేకరించి, విజువల్స్ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.