మేం అధికారంలో ఉండి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది: చంద్రబాబు
- నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామన్న బాబు
- పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తి చేసినట్లు వెల్లడి
- కానీ 2025 నాటికి ఫేజ్ 1 పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్య
తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. దేశానికి దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన పీవీ లాంటి వ్యక్తి తెలుగువారిగా మనకు గర్వకారణమన్నారు. నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని తాను ఆనాడే చెప్పానని, సంస్కరణలకు టెక్నాలజీని జోడించి ముందుకెళ్లినట్లు చెప్పారు.
విభజన తర్వాత నవ్యాంధ్రను అభివృద్ధి దిశగా పాలించినట్లు చెప్పారు. విభజన సమయంలో ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని, రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ తో వచ్చిందన్నారు. సవాళ్లను అధిగమించి 2029 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. 2029 నాటికి దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కానీ ఇప్పుడు ఐటీ ఎగుమతులు సహా వివిధ రంగాల్లో తెలంగాణ కంటే వెనుకబడిందన్నారు.