టీఎస్ పీఎస్సీలో మరో సంచలనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎస్ పీఎస్సీలో మరో సంచలనం

tspsc Groups paper leak
  • గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు
  • ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్ష రాసిన పీఏ ప్రవీణ్
  • 103 మార్కులు వచ్చినా అర్హత సాధించకపోవడంతో సందేహాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ ప్రధాన నిందితుడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ తోపాటు తొమ్మిది మందిని ఈ కేసులో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ గతేడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాశాడు. ఈ పరీక్షలో 103 మార్కులు వచ్చినా ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదు. దీనిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రవీణ్ సామాజిక వర్గానికి ఉన్న రిజర్వేషన్ వల్ల 103 మార్కులు వచ్చిన అభ్యర్థి తప్పనిసరిగా మెయిన్స్ కు అర్హత సాధిస్తారని అధికారులు వివరించారు. అయితే, ప్రవీణ్ మెయిన్స్ కు ఎందుకు సెలక్ట్ కాలేదు, దీని వెనకున్న మతలబు ఏంటనేది ఆరా తీస్తున్నారు. అధికారులు ప్రవీణ్ జవాబుపత్రాన్ని పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్ లో రాంగ్ బబ్లింగ్ చేసినట్లు బయటపడింది. దీనివల్లే ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదని తేలింది. అయితే, ప్రిలిమ్స్ లో అన్ని మార్కులు సాధించేంత ప్రతిభ ప్రవీణ్ కు ఉందా.. ఆ పేపర్ కూడా లీక్ చేశాడా? అనే సందేహంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.

అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షపత్రం లీక్ చేసిన కమిషన్ సెక్రెటరీ పీఏ ప్రవీణ్ మరిన్ని అక్రమాలకు పాల్పడి ఉంటాడనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పరీక్ష పత్రం పేపర్ లీక్ వ్యవహారంలో ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఫోన్ ను పరిశీలించగా.. అందులో చాలామంది మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్ వివరాలు బయటపడ్డాయి. మరికొన్ని మెసేజ్ లు, చాటింగ్ లకు సంబంధించి డిలీట్ చేసిన మెసేజ్ లను రాబట్టేందుకు నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందీ, లేనిదీ తెలిసిపోతుందని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
TSPSC
paper leak
Telangana
praveen
renuka
groups
AE paper

More Telugu News