స్టార్ క్రికెటర్‌ను కలిసిన విజయ్ మాల్యా.. తనకు మంచి స్నేహితుడు అంటూ ట్వీట్
- బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన మాల్యా
- తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ గేల్ తో ప్రత్యక్షం
- గేల్ తో స్నేహం కొనసాగుతోందంటూ వ్యాఖ్య
విజయ్ మాల్యా వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ను కలిసి, అతనితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. యూనివర్స్ బాస్, తనకు మంచి స్నేహితుడైన గేల్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఐపీఎల్లో గేల్ ను ఆర్సీబీలోకి తీసుకున్నప్పటి నుంచి అతనితో మంచి స్నేహం కొనసాగుతోందన్నారు. తాను ఎంపిక చేసిన అత్యుత్తమ ఆటగాడు గేల్ అని ప్రశంసించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మాల్యా యజమానిగా ఉన్నప్పుడు గేల్ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 నుంచి 2017 సీజన్ వరకు గేల్ ఆర్సీబీ తరఫున పోటీ పడి పలు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. గేల్ ఆటకు ముగ్ధుడైన మాల్యా అప్పట్లో అతనికి బెంగళూరులో తన విలాసవంతమైన ఫామ్ హౌజ్ లో ఆతిథ్యం ఇచ్చేవాడు.