Himachal Pradesh: తరగతి గదిలో విద్యార్థి చెంప చెళ్లుమనిపించిన హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్.. వీడియో ఇదిగో!

Viral video shows Deputy Speaker of Himachal assembly slapping student in class
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్ ఓ విద్యార్థి చెంప చెళ్లుమనిపించడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం ఆయన రైలాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూలును సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఓ విద్యార్థి చెంపపై చేయి చేసుకున్నారు. వీడియో బయటకు రావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. హన్స్‌రాజ్ ఓ విద్యార్థితో మాట్లాడుతూ.. అనారోగ్యంగా ఉందా? అని అడిగారు. అదే సమయంలో ఓ విద్యార్థి నవ్వడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ‘క్యోం హస్ రహా హై భాయ్’ (ఎందుకు నవ్వుతున్నావు సోదరా?) అని ప్రశ్నిస్తూ ఆ విద్యార్థి వద్దకెళ్లి చెంప చెళ్లుమనిపించారు. ఆ శబ్దం వీడియో క్లిప్‌లో స్పష్టంగా వినిపిస్తోంది. 

విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఎమ్మెల్యే తన కుమారుడిని కొట్టలేదని, ప్రేమగా అతడి బుగ్గలను తాకారని చెప్పడం గమనార్హం. ఇందుకు తాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ బాలుడి తండ్రి ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే, పక్కనున్న ఓ వ్యక్తి అతడితో అలా చెప్పిస్తున్నట్టు వీడియోలో రికార్డు కావడం గమనార్హం. మరోవైపు, బాలుడిపై చేయిచేసుకున్న హన్స్‌రాజ్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆయన వెంటనే మెంటల్ ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Go Back to Shorts
Himachal Pradesh
BJP
Hans Raj
Student
Slapping
School

More Telugu News