Jagga Reddy: నాపై అభ్యర్థిని నిలిపి గెలిపించుకో.... రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన జగ్గారెడ్డి

Jaggareddy challenges Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు హైదరాబాదు అశోకా హోటల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, దమ్ముంటే తనపై అభ్యర్థిని బరిలో దింపి గెలిపించుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డే హీరో అని ఒప్పుకుంటానని అన్నారు. 

వీహెచ్ మంత్రి హరీశ్ రావును కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీహెచ్ కుమార్తె ఓ డాక్టర్ అని, అందుకోసమే ఆరోగ్యశాఖ మంత్రి అయిన హరీశ్ రావును కలిశారని స్పష్టం చేశారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. పార్టీ నుంచి తమను సస్పెండ్ చేసేది ఎవరు? అంటూ జగ్గారెడ్డి ఆగ్రహంతో ప్రశ్నించారు. రేవంత్ ఒక్కడే పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురాగలడని నిలదీశారు. పార్టీలో సోనియా, రాహుల్ దే అంతిమ నిర్ణయం అని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళుతున్నాడని ఆరోపించారు. 

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రేవంత్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశం కాదని స్పష్టం చేశారు. తామేమీ అసమ్మతివాదులం కాదని, మూడేళ్లుగా కలుస్తూనే ఉన్నామని చెప్పారు. సభలకు వచ్చేవాళ్లు ఓటు బ్యాంకుగా మారతారా అనేది కూడా చూసుకోవాలని వ్యాఖ్యానించారు. 

పార్టీ కష్టకాలంలో ఉందని, పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని శశిధర్ రెడ్డి హితవు పలికారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గత ఎన్నికల్లో ఓటముల దృష్ట్యా రాబోయే ఎన్నికలు పార్టీ మనుగడకు కీలకం అని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Jagga Reddy
Revanth Reddy
Congress
Marri Shashidhar Reddy
Telangana

More Telugu News