Apple: యాపిల్ నుంచి వచ్చేసిన ఐఫోన్ 12 (5జీ).. ఇండియాలో ప్రారంభ ధర రూ. 69,900

  • ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్‌లను విడుదల చేసిన సంస్థ
  • ప్రారంభ ధర రూ. 69,900, గరిష్ఠ ధర రూ. 1.59 లక్షలు
  • ఈ నెల 30 నుంచి భారత వినియోగదారులకు అందుబాటులోకి
Four IPhone 12 series phones launched

అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు 5 జీ ఆధారిత ఫోన్లను నిన్న విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ ఉన్నాయి. భారత్‌లోని వినియోగదారులకు ఈ నెల 30 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు రూ. 9,900 ధరతో హోం ఐప్యాడ్‌ను కూడా యాపిల్ ప్రకటించింది.

ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లలో, బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (రెడ్) రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.  వీటి ప్రారంభ ధర రూ. వరుసగా 79,900, రూ. 69,900గా పేర్కొంది. ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ అంతర్గత మెమొరీతో గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర వరుసగా రూ. 1,19,900, రూ. 1,29,900.

ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటి డిజైన్ నాజూకుగా ఉండడంతో తేలిగ్గా, ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో యాపిల్ సరికొత్త ఏ14 బయానిక్‌ చిప్‌ను అమర్చారు. ఐఫోన్ మినీలో 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉపయోగించగా, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు.

ప్రొ మోడల్‌ ఫోన్లలో 6.1 అంగుళాల స్క్రీన్, ప్రొ మ్యాక్స్‌లో 6.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే ఉంది. 12 ప్రొలో 12 ఎంపీ అల్ట్రావైడ్, 12 వైడ్ యాంగిల్ లెన్స్ 12 టెలిఫొటో లెన్స్ అమర్చారు. ఈ రెండు ఫోన్లు డీప్ ఫ్యూజన్ కెమెరా ఫీచర్‌తో వస్తున్నాయి. ఐఫోన్ 12 ప్రొలో మరింత అధునాతన కెమెరాలు ఉపయోగించారు. ఐఫోన్ 12 ప్రొ ఫోన్‌తో డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.  

ధరల వివరాలు: ఐఫోన్ 12 మినీ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 69,900 కాగా, 128 జీబీ ఆప్షన్ ధర రూ. 74,900, 256 జీబీ వేరియంట్ ధర రూ. 84,900 మాత్రమే. ఐఫోన్ 12 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రై. 79,900 కాగా, 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 84,900. 256 జీబీ వేరియంట్ ధర రూ. 94,900. ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ. 1,19,900, ఐఫోన్ 12 ప్రొ 256 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900, ఐఫోన్ 12 ప్రొ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,49,900గా పేర్కొంది. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900 కాగా, 256 జీబీ ఆప్షన్ ధర రూ. 1,39,900, 512జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,59,900.

More Telugu News