సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్!
- నవంబర్ 8 వరకూ సాగనున్న పొట్టి క్రికెట్
- 51 రోజుల షెడ్యూల్ రెడీ
- నేడో, రేపో అధికారిక ప్రకటన
ఈ సంవత్సరం ఇండియాలో పోటీలు నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా ఉండవని భావిస్తున్న అధికారులు, పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 మధ్య ఈ పోటీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయమై అన్ని ఫ్రాంచైజీలకూ బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లిందని, పోటీల నిర్వహణపై వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నామని ఓ అధికారి వెల్లడించారు. పోటీలు 51 రోజుల పాటు సాగుతాయి కాబట్టి, ప్రసార హక్కులను పొందిన కంపెనీలు, ఇతర వాటాదారులకు సైతం ఎటువంటి అభ్యంతరాలూ ఉండబోవని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి ఈ పోటీలను ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఐపీఎల్ ముగియగానే, ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా వెళ్లాల్సి వుండటం, ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ పాటించడం తప్పనిసరి కావడంతో, ఓ వారం ముందుగానే ఐపీఎల్ ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.