Jagan: వారి పిల్లలేమో ఇంగ్లిషు మీడియంలో చదవాలట.. పేదవారి పిల్లలేమో తెలుగు మీడియంలో చదవాలట!: జగన్ సెటైర్లు

jagan on english medium
షార్ట్స్‌లో చూడండి
పిల్లలను చదివించలేని పరిస్థితులను తల్లిదండ్రులు అధిగమించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం రోజుకో విషయంపై మేథోమథన సదస్సు నిర్వహిస్తోంది. ఈ రోజు విద్యా రంగంపై ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న సదస్సులో ఆయన మాట్లాడారు.

'పేద విద్యార్థులను కూడా ఉన్న చదువులు చదివించాలి. చాలా మంది తమ పిల్లలను చదివించే స్తోమత లేక మధ్యలోనే ఆపుతున్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతాఇంతాకాదు. కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన   చదువుల కోసం తండ్రి పడుతున్న అప్పుల బాధను భరించలేక అతడు ఆ చర్యకు పాల్పడ్డాడు. మంచి చదువులు చదవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు చదవలేకపోతున్నారు' అని జగన్ అన్నారు.

'పేదవారు పేదరికం నుంచి బయటకు ఎప్పుడు వస్తారంటే.. ఆ పేదవారి కుటుంబంలో పిల్లలు కలెక్టరో, లేదా ఓ పెద్ద ఉద్యోగమో చేస్తే పేదరికం నుంచి బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికీ వారు పేదరికంలోనే ఉంటారు. పేదరికానికి ఉన్న ఏకైన సొల్యూషన్ చదువు. పిల్లలను చదివించలేకపోతోన్న తల్లిదండ్రులు ఉన్న ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఇంగ్లిషు మీడియంను తీసుకు వస్తున్నాం'  అని తెలిపారు.

తమ పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య కావాలని తల్లిదండ్రులే కోరారని జగన్ చెప్పారు. ఇటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ అన్నారు. 'అసెంబ్లీలో ఒకమాట మాట్లాడతారు. బయట ఒక మాట మాట్లాడతారు. ఇంగ్లిషు మీడియం బిల్లును అడ్డుకున్నారు. మళ్లీ పెట్టి పాస్ చేశాం. ఇంగ్లిషు మీడియం తీసుకొస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అవుతుందని కొత్త సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.

'వారి చేతలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా తెలుగుని గౌరవించే ఈ పెద్ద మనుషులు తమ పిల్లలు, మనవళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? పేదవారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలట. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదువుకోవాలట' అని జగన్ విమర్శించారు. ఈ విషయంపై కోర్టులకు కూడా వెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News