Andhra Pradesh: ఒరేయ్ జగన్.. దమ్ముంటే నాతో చర్చకు రారా!: కేఏ పాల్ సవాల్

షార్ట్స్‌లో చూడండి
నిన్న అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తాను గది తలుపు వేసేశానని పేర్కొన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. గతంలో తనపై ఆనంద్.ఇన్ హోటల్ లో దాడి చేసేందుకు ప్రయత్నించిన బ్యాచే ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నించిందని, తనకు ప్రాణహాని ఉందని అన్నారు.

ఈ విషయాన్ని చెప్పి, తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరితే, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్ మెన్ ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. నిన్న రాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో దాడి జరిగిందని కేఏ పాల్ తెలిపారు. ఈ సమయంలో తన భద్రతాసిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కు వచ్చిన భీమవరం సీఐ కనీసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదని వాపోయారు.

మీ ఫ్యాన్స్ సార్.. అంటూ వీరంతా తన గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించారని కేఏ పాల్ తెలిపారు. దీంతో ‘రేపు ఉదయం 9.45 గంటలకు రండి.. మాట్లాడుకుందాం’ అని సూచించానన్నారు. అంతలోనే వారు గదిలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వేగంగా తలుపు వేసేశానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పాల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఓరేయ్ జగన్.. దమ్ముంటే రారా.. నాతో డిబేట్ కు. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేడు జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమే కాకుండా నా మీదే దాడి చేయిస్తావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
ka paul

More Telugu News